24 May, 2026 | 12:01 PM

రంగుల లిపి.. చేర్యాల చిత్రకళ!

21-08-2024 02:30 AM

నకాశీ చిత్రకళ.. ఇదొక తెలంగాణ చిత్రకళా రూపం. దీన్ని నకాశీ చిత్రకళా అని కూడా అంటారు. అలా చిత్రాలను వేసేవాళ్లను నకాశీలు అని అంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళా రూపాన్ని కలిగి ఉంటుంది. కరీంనగర్, నిర్మల్, సిద్దిపేటలోని చేర్యాలలో నకాశీ డిజైన్ల పనితనంలో చిన్న తేడాలను గమనించవచ్చు. ఈ కళా రూపాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నది చేర్యాలకు చెందిన దనాలకోట వైకుంఠం కుటుంబం.

అంతరించిపోతున్న నకాశీ కళకు జీవం పోస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పలు ఎగ్జిబిషన్లు, మేళాల్లో తమ కళను ప్రదర్శించడంతో పాటు జాతీయ స్థాయి అవార్డులు పొందారు. కుటుంబ కళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి వైకుంఠం కుమారుడు దనాలకోట రాకేష్ నకాశీ విజయక్రాంతితో పంచుకున్నారు.

ఇది మా పూర్వీకుల కళ. మా కులస్తులు దనాలకోట వెంకటరామయ్య నుంచి ఈ కళ మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. దనాలకోట వెంకటరామయ్య నుంచి  చంద్రయ్య, భారతమ్మ, వైకుంఠం, నాగేశ్వర్, పద్మ, వెంకటరమణ, పవన్ ఇలా తరతరాలుగా ఈ కళను వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలు మాత్ర మే ఈ కళను కొనసాగిస్తున్నాయి. వీరితో పాటు ఈ కళను నేర్చుకున్న మరో రెండు కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాయి. 

ఈ కళ గురించి చెప్పాలంటే.. చరిత్ర గురిం చి కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కాలంలో నిజాం ప్రభువుల దగ్గర కొందరు కళాకారులు ఉండేవారు. అలంకరణ వస్తవులను అద్భుతం గా తయారుచేసేవారు. ఆ పనితనాన్ని మె చ్చిన ప్రభువు వారిని ‘నక్షి’ కళాకారులుగా పిలిచేవారు. ‘నక్షి’ అంటే ఉర్దూలో ‘ఫైన్ వర్క్’ అని అర్థం. అలా వారి పేరు కాలక్రమంలో ‘నకాశీ’గా మారిందని కథనం ప్రచారంలో ఉన్నది. 

బ్రిటిష్ మ్యూజియంలోనూ..

హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం లో మా పూర్వీకులు తయారు చేసిన 17వ శతాబ్దం నాటి పెయింటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే లండన్, ప్యారిస్ నగరాల్లోని మ్యూజియాల్లోనూ చేర్యాల పెయింటింగ్స్ ఉన్నాయి. బ్రిటిష్ మ్యాజియంలో ఓ పుస్తకం కవర్‌పేజీపైనా నకాశీ పెయింటింగ్స్ కనిపిస్తాయి. అందంతా మా కలర్స్ గొప్పతనం అని చెప్పొచ్చు. ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా ఉంటాయి. మన వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్, గోల్కొండ, లేపాక్షి, శిల్పారామం, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లోనూ ఈ పెయింటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. రామాయణ, మహాభారతం, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తాం. పెయింటింగ్స్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ ఇస్తూ.. వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తున్నాం. 

కుల పురాణాలు వివరించే కళ..

కథకు అనుగుణంగా పెయింటింగ్స్ వేసి ఇ స్తాం. కూపపులివారు సాధనాశూరులు, పద్మాశాలీలకు మార్కండేయ పురాణం, భావనా రుషి కథ, గౌడజెట్టిలు ఏనూటివారికి గౌడ పురాణం, కంఠమ మహేశ్వర పురాణాలు, మందహెచ్చులవారు యాదవులకు కాటమరాజు కథను, కాకి పడగలవారు ముదిరా జులకు గంగాదేవి కథ, పెద్దమ కథ, మహాభారతం, గుర్రువారికి మాలల పురాణం, అద్దపు, మంగలి, డక్కలి, మాదిగలకు జాంబ పురాణం, మాసయ్యలు రజకులకు మడేల్ పురాణం చెబుతారు. మాకు చెప్పే కథల ఆధారంగా బొమ్మలు గీసి ఇస్తాం. 

ఎలాంటి రంగులు వాడుతారు? 

నకాశీ పెయింటింగ్స్‌కు చాలా సహజ సిద్ధమైన రంగులనే వాడుతాం. పెయింటింగ్స్ నా ణ్యతకు వాటి తయారీలో ఉపయోగించే సహజసిద్ధమైన రంగులే ఇందుకు కారణం. మొద టగా చిత్రానికి కావాల్సిన కొలతలతో తెల్లటి ఖాదీబట్టను సిద్ధం చేసుకుంటాం. గంజి, సుద్దమట్టి, బంకతో ఒక రకమైన ద్రావణాన్ని త యారు చేస్తాం. దీన్ని ఖాదీబట్టపై కోటింగ్ వేసి గట్టిపడేలా చేస్తాం. తర్వాత ఆ బట్టపైనే కావాల్సిన బొమ్మను పెన్సిల్‌తో డ్రాయింగ్ వేస్తాం. తర్వాత రంగురాళ్లను నూరుకొని రంగులు తయారు చేస్తాం. తిరుమని చెట్ల నుంచి తీసిన బంకను మెత్తగానూరి నీళ్లు కలిపి ద్రావణం చేస్తాం. ఈ రెండింటినీ కొంచెం కొంచెంగా కలుపుతూ కాన్వాస్‌పై రంగులద్దుతాం. దీపానికి పట్టే మసి, శంఖం పొడి, కూరగాయల నుంచి తయారు చేసిన రంగులను కూడా నకాశీ పెయింటింగ్స్ కోసం వాడతాం. కుంచెలను కూడా కళాకారులే తయారు చేసుకుంటారు. మేక వెంట్రుకలతో, ఉడుత తోక వెంట్రుకలతో వీటిని రూపొందిస్తాం. 

ఆదరణ పెరిగింది..

ఇది మా తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన సంపద . మా నాన్న పేరు దనాలకోట వైకుంఠం. ఆయన నేషనల్ అవార్డు గ్రహీత. నేను బీటెక్ చదివాను. సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ల డం నాకు ఇష్టం లేదు. వారసత్వంగా వస్తున్న మా కుల వృత్తిని కాపాడటం మా బాధ్యతగా భావిస్తా.  మా కుటుంబం మొత్తం పెయింటింగ్స్‌పైనే నిమగ్నమై ఉంటాం. ఆసక్తి ఉన్నవాళ్లకు శిక్షణ కూడా ఇస్తుంటాం. ప్రస్తుతం ఆదరణ బాగా పెరిగింది. ఒకప్పుడు కుల పురాణాలు మాత్రమే గీసేది. కానీ కాలానికి అనుగుణంగా పెయిటింగ్స్‌గా కూడా మార్చుకుం టూ వచ్చాం. ఇప్పుడు ప్రకృతికి సంబంధించినవి, తెలంగాణ కళలు, సంస్కృతీ, పంటలు, జానపద కథలు, జీవన విధానానికి సంబంధించిన పెయింటింగ్స్ వేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా నకాషీ డిజైన్లను తయారుచేస్తున్నాం. 

 దనాలకోట రాకేష్ నకాశీ

నా కుటుంబం చేతిలో ఓ కళ ఉంది!

రోజూ కనీసం 5 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్‌లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతో పాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్లగా ఈ కళను నేర్చుకుంటున్నది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దాన్ని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాత తరం దాన్ని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఇదే నా నమ్మకం. దీని వల్ల నా కుటుంబ ఆదాయం పెరిగింది.                                       

దనాలకోట వైకుంఠం భార్య వనజ