ఇల్లందులో బీసీ బంద్ సంపూర్ణం
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీ బంద్ సంపూర్ణంగా ముగిసింది. బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెదేపా, బీసీ కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీసీ బందును నిర్వహించారు. విద్యా వ్యాపార సంస్థలు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. బందు నేపథ్యంలో ఇల్లందులో బస్సు రవాణా పూర్తిగా నిలిచిపోయింది, ఇల్లందు ఆర్టీసీ బస్సు డిపో నుంచి బస్సు సర్వీస్ లు నిలిపివేయడంతో ప్రయాణికులు లేక బస్టాండ్ బోసిపోయింది.
అఖిలపక్షం ఆధ్వర్యంలో స్తానిక జగదంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ మేమెంతో మాకు అంత అనే నినాదంతో బీసీ రిజర్వేషన్ ఎవరి బిక్ష కాదని ఇది బీసీల హక్కని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని, రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 9వ షెడ్యూల్లోకి చేర్చి బీసీ రిజర్వేషన్ ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు దండ రామచందర్, అఖిలపక్ష నాయకులు దిండిగల రాజేందర్, పులి సైదులు, మధు, అబ్దుల్ నబి, సారయ్య, మడత వెంకట్ గౌడ్, ముద్రగడ వంశీ తదితరులు పాల్గొన్నారు.
నల్ల కండువా ధరించి బీసీ బందుకు మద్దతు ప్రకటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్
ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర బీసీ నాయకులు మడత వెంకట్ గౌడ్ బీసీ జేఏసీ బంధు పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ గా పదవి అనుభవించారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేశారు. బీసీ బందులో ఏ రాజకీయ కండువా కప్పుకోకుండా నల్ల కండువా కప్పుకొని ప్రత్యేకంగా తన ఏక్త హౌస్ సభ్యులు, అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి అఖిలపక్ష నాయకులతో కలిసి మద్దతు తెలిపారు.
అఖిలపక్షంతో కలవని తెదేపా
బిసి జేఏసీ బందు నేపథ్యంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో అఖిలపక్షంతో కలవకుండా బీసీలకు మద్దతుగా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావాలంటే మళ్ళీ తెలుగుదేశం ద్వారనే సాధ్యమవుతుందన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ బందుకు మద్దతు ప్రకటించిన బిజెపి బందులో పాల్గొనకపోవడం కోసం మెరుపు.




