calender_icon.png 18 July, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు ఆర్డినెన్స్ చరిత్రాత్మకం

15-07-2025 12:00:00 AM

రాచమల్ల సిద్ధేశ్వర్ :

‘తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి. రాష్ట్రాన్ని ప్రజా తెలంగాణగా మార్చేందుకు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ‘సోనియ మ్మా..’ అంటూ నాపై మీరు చూపే ప్రేమ కు నేను మీకు ఎప్పుడూ కృతజ్ఞురాలినే’ అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోని యా గాంధీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సం దేశమిచ్చారు. సబ్బండ వర్గాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ నియంతృత్వ పాలన సాగింది.

ఉద్యమ ఆశయాలేవీ అప్పుడు నెరవేరలేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై పూర్తి అవ గాహన ఉన్న సోనియాగాంధీ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పాలన వస్తుందని ఎన్నికల ముందే ఊహించారు. దీనిలో భాగంగానే పార్టీ తరఫున అనేక హామీలిచ్చారు. వాటి లో ప్రధానమైనది రాష్ట్రంలోని పేద బడు గు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడం. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ కామారెడ్డి సభలో ‘బీసీ డిక్లరేషన్’ను ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గా లు చేపట్టిన తర్వాత అనతికాలంలోనే ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్నది. దీనిలో భాగంగానే సర్కార్ తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇది చరిత్రాత్మక ఘట్టం.

రాజ్యంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదల పక్షాన ఆలోచించేది దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని  పార్టీ మరోసారి నిరూపించింది. సత్సంకల్పంతో కులగణన నిర్వహించింది. జనాభా ఆధారంగా పేద, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని చకచకా అడుగులు ముందుకు వేసింది. 

వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా..

వెనుకబడిన బడుగు బలహీన వర్గాల కు న్యాయం జరగాలనే సంకల్పంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా ఆధా రిత రిజర్వేషన్లపై దృష్టి సారించింది. నిబంధనలకు అనుగుణంగానే కులగణను విజయవంతంగా నిర్వహించింది. ఎలాం టి అనుమానాలకు తావివ్వకుండా భారీ స్థాయిలో సిబ్బందిని నియమించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రక్రియ పూర్తి చేసింది. తద్వారా యావత్ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది.

రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కుల గణనపై యావత్ దేశ ప్రజల నుంచి ప్రశంసలొస్తున్నాయి. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం షరామాములుగా విమర్శలు చేస్తున్నాయి. కులగణన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో బీసీలు 56 శాతానికిపైగా ఉన్నారని తేలింది. వారికి స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేన్లు కల్పించేందుకు సర్కార్ సిద్ధమైంది.

ఈమేరకు 2025 మార్చి 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించిం ది. ఆ మరుసటి రోజే సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ను కూడా ఆమోదించింది. అలా దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ రెండు బిల్లుల ఆమోదం.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి నిదర్శనం.

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన బిల్లుల చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభు త్వానికి పంపగా, కేంద్రం రాజకీయ దృష్టితో చూసి వాటిని బుట్టదాఖలు చేసిం ది. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ నిబంధన దృష్ట్యా ఈ బిల్లును రాజ్యాంగం 9వ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేయగా బీజేపీ ప్రభుత్వం తాత్సారం కొనసాగించింది.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు. స్వయంగా ప్రధాని మోదీని కలిశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపో యింది. తర్వాత కొద్దిరోజులకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా కూడా నిర్వహించారు. అయి నా.. కేంద్రప్రభుత్వంలో చలనం రాలేదు. ఈ ధర్నాలో సుమారు 16 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

వారంతా స్వచ్ఛందంగా తెలంగాణ బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చారు. తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంద రూ ప్రధాని మోదీ ముందు మౌనమే దాల్చారు. తెలంగాణ బీసీ బిలుల్లపై కనీ సం నోరు మెదపలేదు. కానీ, బాధ్యత గల కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోలేదు. బీసీ బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నది. ప్రతిపక్షాలు సహకరించకపోయినా, బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది.

ఓర్వలేకనే బురద జల్లడం..

కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పక్షాన వారికి సామాజిక న్యాయం చేస్తుండటాన్ని బీఆర్‌ఎస్, బీజేపీలు ఓర్వలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజ లు కీర్తిస్తుండటాన్ని ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో కాకుండా, కనీస బాధ్యత అని కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ భావించలేదు.

పైగా సామాజిక న్యాయం చేయాల ని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే సదుద్దేశంతో రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఆధారపడకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసిందనే సంతోషంతో బలహీన వర్గాలు సంబురాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం కత్తులు నూరుతున్నాయి.

ప్రభు త్వ ఆర్డినెన్స్ న్యాయస్థానాల్లో నిలబడదని, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలను ఉదాహరణ పేర్కొంటూ ప్రతిపక్షాలు బీసీ ల్లో అభద్రతాభావాన్ని కలుగ జేస్తున్నా యి. ఆర్డినెన్స్‌కు  న్యాయపరమైన చిక్కులు రాకుండా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే విషయాన్ని  గుర్తించాలి.

ఇప్పటికే 50 శాతం సీలింగ్‌కు మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రా ల నిబంధనలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ పట్టుదలగా ఉంది.  

గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం..

గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను కేవలం 23 శాతం మాత్రమే అమలు చేసింది. తద్వారా బీసీలకు అన్యాయం చేసింది. కనీసం సర్కారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సైతం బయటపెట్టలేదు. అలాంటి బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను, బీసీ రిజర్వేషన్లను తప్పుబట్టడం హాస్యాస్పదం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలేవీ లేవు.

బీసీల సంక్షేమ కోసం చేసిన కృషి కూడా ఏమీ లేదు. తెలంగాణ బీసీ బిల్లుకు కేం ద్రం చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేయడంలో విఫలమైన బీజేపీ నేతలను జనం ఛీకొడుతున్నాయి. బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు  ప్రధాని నరేంద్ర మోదీపై ఏమాత్రం ఒత్తిడి తేలేదని, వారిపై విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా రాజకీయాలకు చేస్తున్నాయి. 

తెలంగాణలో కులగణన విజయవం తం కావడంతో అన్ని వైపులా ఉండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయం. ఇదే పంథాలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మరోసారి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం ఖాయం. పార్టీల దృక్పథాలు ఎలా ఉన్నా, రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ‘రాజకీ యంగా మేం రారాజులం’ అని బీసీలు గర్వించేలా ఉంది.