16-07-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది. తన మాటను, పెద్దరికాన్ని లేశమాత్రమైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవించడం లేదని ట్రంప్‌కు అర్థమైంది. ఇతర దేశాల్లో వ్యవహారాల్లో తలదూర్చకుండా, జాతీయవాదంతో దేశ వాణిజ్య విధానాలను రక్షించుకునే విధంగా ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్నిచ్చిన ట్రంప్, ఇప్పుడు తన మాట వినని దేశాలపై వాణి జ్య సుంకాలతో ఆర్థిక యుద్ధానికి తెరలేపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని తను వైట్‌హౌజ్‌కు తిరిగివచ్చిన 24 గంటల్లో ఆపివేస్తానని ప్రతిజ్ఞ చేసిన ట్రం ప్‌కు నిరాశే ఎదురైంది.
ఉక్రెయిన్‌పై 2022లో దాడి మొదలుపెట్టినప్పటి నుంచి కొనసాగుతున్న యుద్ధం పరిసమాప్తికి దారులన్నీ మూసుకుపోయాయని ట్రంప్‌కు తెలుసు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించి న ప్రతిసారి.. ఇక కాల్పుల విరమణకు రంగం సిద్ధమైనట్లుగా ట్రంప్ అనేకసా ర్లు ఆనందం వ్యక్తం చేసారు. ప్రకటనలిచ్చారు. పుతిన్‌తో వ్యవహారం అంత తేలిక కాదని అమెరికా ప్రభుత్వాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, పుతిన్‌పై ట్రంప్ అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తూనే వున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు, పుతిన్‌ను చర్చలకు అంగీకరింపజేయడానికి ఆరు నెలలుగా ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. తను పుతిన్‌తో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ రష్యా, ఉక్రెయిన్‌పై దాడులను రెట్టింపు చేయడం ట్రంప్‌కు అసహనాన్ని కలిగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పిలిచి, అవమానించి.. బుజ్జగించి తన మాట వినేలా చేసుకున్న ట్రంప్‌కు, యుద్ధాన్ని ఆపించి పాప్యులారిటీ పెంచుకోవాలనుకున్న ప్రయత్నాలకు పుతిన్ రూపంలో చుక్కెదురైంది.
అందుకే, సహనం నశించిన ట్రంప్, రష్యాపై సుంకాల అస్త్రం తీశారు. 50 రోజుల్లోగా యుద్ధం పరిసమాప్తి కాని పక్షంలో రష్యాపై వందకు వందశాతం సుంకాలు విధిస్తామని, రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు దిగుమతి చేసుకునే దేశాలనూ వదలమని ప్రకటించారు. అంతేనా, ఇక ఉక్రెయిన్‌ను తాము నిలువరించబోమని, ఆ దేశం కూడా తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవచ్చుననీ ట్రంప్ చెప్పారు. అంటే, నాటో ద్వారా అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తాం.. రష్యాపై విరుచుకుపడండి.. అని ట్రంప్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. భయంకరమైన రష్యా క్షిపణులను దాడిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పుడు పాట్రియట్ క్షిపణులను నాటో ద్వారా సరఫరా చేయనుంది.
ఉక్రెయిన్‌కు యుద్ధక్షేత్రంలో తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన ట్రంప్, కోట్లాది డాలర్ల విలువ చేసే అత్యాధునిక ఆయుధాలను అందించనున్నారు. అటు సుంకాల అస్త్రం, ఇటు ఉక్రెయిన్‌కు సైనిక అస్త్రాల సరఫరాతో రష్యాను దెబ్బతీయాలనేది అమెరికా పథకం. సుంకాలు విధిస్తే రష్యాకు కొంత కష్టమే అవుతుంది. రష్యా ఆర్థిక వ్యవస్థలో చమురు, సహజ వాయువు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ప్రధానమైంది. రష్యా ఎగుమతుల్లో దాదాపు 60శాతం చమురు, సహజ వాయువులే వున్నాయి.
స్టాలిన్ తర్వాత రష్యాలో అనేక ఏళ్ల పాటు నాయకత్వ స్థానంలో ఉన్న పుతిన్, దేశ ఆర్థిక స్థితిని, ఆయుధ సంపత్తిని బేరీజు వేసుకోకుండా వుండరు. నాటో దేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌పై పట్టు బిగించే లక్ష్యంగానే రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. కాల్పుల విరమణ యత్నాలను పుతిన్ ఇంతకాలం ఆషామాషీగానే కొనసాగించారనేది స్పష్టమవుతున్నది. పుతిన్ తన మిత్రుడే, ఫోన్‌లో బాగా మాట్లాడారు.. అని చెప్పుకున్న ట్రంప్‌కు ఇప్పుడు మిత్రుడిపై నిజంగానే కోపమొచ్చింది.