04-02-2026 08:42:44 PM
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ఆంజనేయులు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎక్సైజ్ కానిస్టేబుల్, పద్మశాలి ముద్దుబిడ్డ సౌమ్య త్యాగం మరువలేనిదని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులతో కలిసి సౌమ్యకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా, అందులోని దుండగులు కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందినట్లు తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.