calender_icon.png 19 July, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యాల సాధనతో బంగారు భవిత

15-07-2025 12:00:00 AM

డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి

నేడు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం :

* ఉత్తమ వృత్తి శిక్షణ, ఏఐ నైపుణ్యాల్లో వృద్ధి, డిజిటల్ సాధికారత వంటి అంశాలపై యువత దృష్టి సారించాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన చదువులు కొనసాగాలి. ఉత్తమ శ్రేణి బోధనలు, అవసర మౌలిక వసతులు, నైపుణ్యాల వృద్ధికి తగిన నిధులను వెచ్చించడం, నాణ్యమైన విద్యా బోధనలు నేటి తక్షణ కర్తవ్యం అని మరువరాదు. నేటి యువత నాణ్యమైన నైపుణ్య విద్య పొందితే మన యువశక్తి దేశానికి వరంగా మారుతుంది. యువతలో నైపుణ్యాలు కొరవడితే యువశక్తి శాపంగా మారి, అశాంతికి ఆజ్యం పోస్తుంది. 

యువతలోని నైపుణ్యశక్తే ఒక దేశాన్ని ముందుకు నడిపించే సాధనం. అందుకే ప్రభుత్వాలు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తాయి. నైపుణ్యం లేని యువత చాలామంది వివిధ రంగాల్లో ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా బండి నడిపిస్తున్నారు. నేటి ఏఐ యుగమైనా, ఏ రం గంలోనైనా.. నైపుణ్యమే కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాల్లోకెల్లా భారత్‌లో అత్యధిక యువ జనాభా ఉందనేది వాస్తవం.

దేశ జనాభాల్లో 35 ఏళ్లలోపు వారు 66 శాతం అంటే.. మన దేశానికి ఎంత యువ సంపద ఉందో అర్థం చేసుకోవ చ్చు. అయితే.. అన్ని కోట్ల మంది యువత లో ఎంతమందికి వృత్తిపరమైన నైపుణ్యాలు ఉన్నాయనేది అసలైన ప్రశ్న. ఏ దేశమై నా అభివృద్ధిలోకి రావాలంటే ఉద్యోగుల్లోని నైపుణ్యాలే కీలకం. దేశంలో యువత ఎంత సంఖ్యలో ఉన్నా, వారిలో కావాల్సిన నైపుణ్యం లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అందుకే యువత లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలో ఉన్న యువత అంతటికీ ఇప్పటికే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే, దేశం ఇప్పటికే ప్రపంచంలోనే మేటి శక్తిగా ఆవిర్భవించి ఉండేది. కేవలం ఆర్థిక శక్తిలోనే కాకుండా ఇంకా అనేక రంగాల్లో భారత్‌కు తిరుగుండేది కాదు. నిపుణుల అంచనా ప్రకారం.. అన్ని రంగాల్లో పని చేస్తున్న యువతలో కొంత మందికి మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయి.

మిగతా వారందరూ ఏదో అలా నెట్టుకొస్తున్నారు. అధిక యువ జనాభా కలిగిన యువ భారత్‌ను వెంటాడుతున్న ప్రధాన సమస్య ఇదే కావడం గమనార్హం. నేడు పారిశ్రామికరంగం ఆశిస్తున్న నైపుణ్యాల కు, యువత కలిగి ఉన్న నైపుణ్యాలకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉంటున్నది. నైపుణ్యాలు లేకపోవడం వల్లనే దేశాభివృద్ధి అంతగా ఉండటం లేదనేది నిపుణుల అభిప్రాయం.

యువతలో నైపుణ్యాలు కొరవడితే నిరుద్యోగం పెరగడం, తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయడం వం టి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవసరమైన నైపుణ్యాలు లేని యువతతో నిరుద్యోగ సమస్యలు పెరిగి సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, సమానత్వ భావనలు పలుచబడే ప్రమాదం ఉంది.

పౌర సమా జ సుస్థిరాభివృద్ధికి, ఆరోగ్యకర సమాజ స్థాపనకు నైపుణ్య యువతే పునాది అనే విషయాన్ని మరవకూడదు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీ), పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలను అనుగుణం గా విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు బోధిస్తే పరిస్థితిలో మార్పు ఉంటుంది. 

ఏఐ నైపుణ్యాలతో  సాధికారత

ఏటా జూలై 15న ‘ప్రపంచ యువ నైపు ణ్య దినోత్సవం’ నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 2014లోనే నిర్ణయించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు ఏటా జూలై 15న ఆ దినోత్సవం నిర్వహిస్తున్నాయి. అలా తొమ్మిదేళ్ల నుంచి ఆ వేడుకలు జరుగుతున్నాయి. ఈసారి నిర్వహించే వేడుకలు  పదోసారి. అందుకు అనుగుణంగా ఈ ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ స్కిల్స్ డే’ ఇతివృత్తంగా ‘కృత్రిమ మేధ, డిజిటల్ నైపు ణ్యాల్లో యువత సాధికారత” అనే అంశా న్ని తీసుకుంది.

‘ఏఐ, సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణ’ మొదలైన రంగాల్లో నేటి యు వత నడుం బిగిస్తే ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవం సాకారం అవుతుందని ఐక్యరాజ్య సమితి భావిస్తున్నది. రేపటి రోజున యువత కూడా పరిశ్రమల్లో పని చేసేందుకు సిద్ధం అవుతారు. ప్రస్తుత రోజుల్లో మన జీవితాలు, లెర్నింగ్, చేసే పనులను ఏఐ నిర్ణయిస్తోంది. పరిశ్రమ కోరుకున్న నైపుణ్యాల్లో మాత్రమే మన యువతను సదా సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నైపుణ్య యువతతో సమాజ శాంతి, సమ్మిళిత సుస్థిరాభివృద్ధి సుసాధ్యం అవుతాయని నేటి విద్యాలయాలు, ప్రభుత్వాలు, యువత, పౌర సమాజం, విధానాలు రూపొందించేవారు గట్టిగా నమ్మాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఉత్తమ వృత్తి శిక్షణ, ఏఐ నైపుణ్యాల్లో వృద్ధి, డిజిటల్ సాధికారత వంటి అంశాలపై యువత దృష్టి సారించాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన చదువులు కొనసాగాలి.

ఉత్తమ శ్రేణి బోధనలు, అవసర మౌళిక వసతులు, నైపుణ్యాల వృద్ధికి తగిన నిధులను వెచ్చించడం, నాణ్యమైన విద్యా బోధనలు నేటి తక్షణ కర్తవ్యం అని మరువరాదు. నేటి యువత నాణ్యమైన నైపుణ్య విద్యను పొందితే మన యువశక్తి దేశానికి వరంగా మారుతుంది. యువతలో నైపుణ్యాలు కొరవడితే యువ శక్తి శాపంగా మారి, అశాంతికి ఆజ్యం పోస్తుంది. మన యువతను నైపుణ్య శక్తిగా మార్చి.. అగ్ర రాజ్యాల సరసన సగర్వంగా నిలబడదాం. 

యువశక్తి 1.22 బిలియన్లు..

ప్రపంచంలోని 8.2 బిలియన్ల జనాభాలో 15 నుంచి 24 ఏండ్ల వయస్సు కలిగిన యువత జనాభా 1.22 బిలియన్లు (దాదాపు 15.4 శాతం) ఉన్నారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 64 ఏండ్ల వయస్సు కలిగిన పని చేసే లేదా వర్కింగ్ క్లాస్ జనాభా 78 శాతం అనగా 6.4 బిలియన్లు ఉన్నారు. నేడు భారత జనాభా 1.46 బిలియన్లుగా ఉన్నది. ఇందులో 15 నుంచి 29 ఏండ్ల యువత జనాభా 40 శాతం వరకు ఉన్నది.

మన దేశంలో 15 నుంచి 64 ఏండ్ల వయస్సు కలిగిన పని చేసే లేదా వర్కింగ్ క్లాస్ జనాభా 96.1 కోట్లు (లేదా 0.961 బిలియన్లు), అనగా 68 శాతం వరకు ఉన్నది. భారత్‌లో 15 ఏండ్ల లోపు జనాభా 24 శాతం, 64 ఏండ్లు దాటిన వారి జనాభా 7 శాతం వరకు ఉన్నది. ఇతర దేశాలతో పోల్చితే భారత జనాభా సగటు వయస్సు చాలా తక్కువగా 28.8 ఏండ్లు మాత్రమే ఉన్నది. జపాన్ ప్రజల సగటు వయస్సు 49.9 ఏండ్లు ఉన్నది.

అందువల్లనే ఇండియాను ‘యువ భారత్’ అని, జపాన్‌ను ‘ఓల్డ్ జపాన్’ అని పిలుస్తున్నాం. యువత జనాభా అధికంగా ఉండడం వల్ల రాబో యే రోజుల్లో విశ్వవేదికలపై భారత్ సగర్వంగా ముందుకు నడిచే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.