14-07-2025 12:00:00 AM
42 శాతం రిజర్వేషన్‌లు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూలై 13 (విజయ క్రాంతి); బీసీలకు రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చేందుకే 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం లోని దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం దోమకొండలో విజయ పాల కేంద్రాన్ని బి ఎం సి ని ప్రారంభించారు. భిక్కనూరు మండలం బా గీర్తి పల్లి లో వనమా ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చాముండేశ్వరి అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించేందుకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని స్థానిక సంస్థల్లో కల్పిస్తున్నట్లు తెలిపారు. కొందరు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
బీసీలకు రాజకీయ ప్రాముఖ్యత ఇచ్చేందుకే 42 శాతం రిజర్వేషన్ ఇంకెందుకు శాసనసభ సమావేశాల లో ఆమోదం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల వారికి రాజకీయంగా భవిష్యత్తు కల్పించాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించాలని ఉద్దేశంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, దోమకొండ మండలం కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, నాగరాజు రెడ్డి, నాగరాజు గౌడ్, మాజీ సర్పంచ్ ఐరేని నరసయ్య, చాముండేశ్వరి ఆలయ కమిటీ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.