03-02-2026 01:27:37 AM
ఖైరతాబాద్,ఫిబ్రవరి2(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం, కేటాయింపుల్లోని మాయాజాలాన్ని ఎండగడుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భారీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సోమవారం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ (బీపీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏ ఎస్ అధికారి టి. చిరంజీవులు, బీపీఎఫ్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ యెలికట్టె విజయ్ కుమార్‌గౌడ్, కాకతీయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళి మనోహర్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
రాష్ట్ర జనాభాలో 61 శాతంగా ఉన్న బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీరని అన్యాయం జరుగుతోందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వక్తలు ప్రసంగిస్తూ రాష్ట్రం ఏర్పడిన గత 12 ఏళ్ల కాలంలో జరిగిన ఖర్చును విశ్లేషిస్తూ సంచలన గణాంకాలను బయటపెట్టారు. 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.28 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయగా అందులో బీసీల కోసం కేటాయించింది కేవలం రూ.65,546 కోట్లు మాత్రమేనని దుయ్యబట్టారు.
అందులోనూ వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం రూ. 31,713 కోట్లు మాత్రమేనని, అంటే మొత్తం బడ్జెట్లో బీసీల వాటా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని వారు ఆధారాలతో నిరూపించా రు. బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి వంటి పథకాల ఖర్చులను కూడా బీసీల ఖాతాలోనే చూపిస్తూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కల ముందు ఇచ్చిన ’కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను తుంగలో తొక్కిందని నేతలు ఆరోపించారు.
ఏడాదికి రూ.20,000 కోట్లు, ఐదే ళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మాట ఇచ్చి గత రెండేళ్లలో కేవలం రూ.5,000 కోట్లు మా త్రమే ఖర్చు చేయడం బీసీలను వంచించడమేనని విమర్శించారు. రాష్ట్రంలోని 24 బీసీ కార్పొరేషన్లకు గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న బీసీలకు కనీస మద్దతు లేదని, కేటాయించిన నిధులు కూడా ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసం తక్షణమే జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలన్నారు.
బీసీ మేధావులు, రాజకీయ నాయకులు ఏకమై ఈ అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విశ్లేషణను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపాలని తీర్మానించారు. ఈ సమావేశంలో విశారధన్ మహారాజ్, దుర్గ య్య గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, బైరి శేఖర్, అంబాల నారాయణగౌడ్, నరేశ్ గౌడ్, వెంక న్న, శేఖర్, గోలి గిరి, దాసోజు లలిత, సూర్యనారాయణ తదితరులున్నారు.