12 May, 2026 | 5:02 PM

నకిలీ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి

24-04-2024 01:45 AM

l విద్యార్థులకు యూజీసీ కీలక సూచన

l ‘10 రోజుల్లో ఎంబీఏ’ వంటి ప్రకటనలతో జాగ్రత్త అని హెచ్చరిక

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): విద్యార్థులకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో నకిలీ కోర్సుల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ‘పది రోజుల్లోనే ఎంబీఏ’ వంటి కోర్సుల పేర్లతో చేస్తున్న ప్రకటనలతో మోసపోవద్దని తెలిపింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ల మాదిరిగానే సంక్షిప్త పదాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్, కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు విద్యార్థులకు ఎరవేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

అలాంటి వాటిలో ‘10 రోజుల్లో ఎంబీఏ’ అంశం తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ఏదైనా ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించాలనుకుంటే యూజీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ప్రోగ్రామ్‌లను అందించేందుకు అనుమతి పొందిన ఉన్నత విద్యాసంస్థల జాబితా అధికారిక వెబ్‌సైట్‌లలో ఉందని, అడ్మిషన్లు పొందే ముందు నిర్ధారించుకోవాలని తెలిపారు.