12 May, 2026 | 6:09 PM

కాంగ్రెస్‌లో బీ ఫామ్ టెన్షన్

24-04-2024 01:41 AM

l హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలో అభ్యర్థులను ఖరారు చేయని పార్టీ

l అధికారికంగా ప్రకటించకున్నా నామినేషన్ వేసిన పలువురు 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే సమయమున్నా.. కాంగ్రెస్ మాత్రం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 14 మంది క్యాండిడేట్లను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో టికెట్ కోసం పార్టీ నేతల పోటీ తీవ్రంగానే ఉంది. టికెట్ల ఆశావాహులు ఈ మూడు నియోజకవర్గాల్లో నామినేషన్లు సై తం వేశారు. అయితే పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ఆశావాహుల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది.

కరీంనగర్‌లో వెలిచాల రాజేందర్‌రావు సోమవారం నామినేషన్ వేయగా, ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ స్థానంలో సైతం పులిపాటి రాజేశ్‌కు మార్ నాలుగు రోజుల క్రితమే నామినేషన్ వేశారు. ఇప్పుడు వారికి బీ ఫామ్ అందుతుందా? లేక కొత్త వారికి ఇస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ మూడు స్థానాల్లో అధికారిక అభ్యర్థి ఎవరనేది తేలకుండానే వారి జాగ్రత్తలు వారు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ముగ్గురు అభ్యర్థులు టికెట్ వస్తుందనే నమ్మకంతో నామినేషన్లు వేశారని చెప్తున్నారు. హైదరాబాద్ స్థానంలో డీసీసీ ప్రెసిడెంట్ సమీర్ వలీవుల్లాఖాన్ పేరు వినిపిస్తున్నప్పటికీ రాజేశ్‌కుమార్ నామినేషన్ వేశారు.

ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎం సతీమణి నందిని, మాజీ మంత్రి మం డవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాయ ల నాగేశ్వర్‌రావు తదితర పేర్లు వినిపిస్తున్నా.. రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్సీ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. పెండింగ్ లో ఉన్న మూడు సీట్లకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన వెంటనే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్లు వేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇస్తే వీరు తప్పుకోవాల్సి వస్తుంది.