వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మంత్రి పొంగులేటి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే ఐదారు రోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం లో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలి..
నగరంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా, మేయర్ గద్వాల విజయలక్ష్మిఅధికారులను ఆదేశించారు. అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో వారు వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు కమిషనర్ అమ్రపాలి.. మెహదీపట్నం, అత్తాపూర్, గుడిమల్కాపూర్, విజయనగర్‌కాలనీ, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో పర్యటించి వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు.






