ఫుడ్ సేఫ్టీలో ఆదర్శంగా నిలవాలి
- నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
- జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై మంత్రి రాజనర్సింహ అసంతృప్తి
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ర్టంలో నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను అందించడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. శనివారం నాడు సచివాలయం లోని తన కార్యాలయంలో మంత్రి ఫుడ్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ర్టవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా రోజుకు సుమారు 180 నుండి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ కోసం కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటు వసతి గృహాలు, హాస్టళ్లు, మెస్‌లలో భోజనం చేసే విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ -2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు.
టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అన్ వీల్స్ (ఫుడ్ లాబ్స్), అకస్మిక తనిఖీలు, అవగాహన సదస్సులను నిరంతరం నిర్వహించాలన్నారు. జిహెఎంసి పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి శనివారం మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా చేపట్టిన టెస్టులను వివరాల నివేదికను అందించాలన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం, మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌తో నిరంతరం అవగాహన సదస్సు లను నిర్వహించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, రాష్ర్ట ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివ లీల, స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ హెడ్ లక్ష్మీనారాయణ రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్స్ (జీహెఎంసీ) అమృత బాలాజీ రాజు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.






