అభివృద్ధి పేరుతో అప్పుల భారమా?
-రూ.300 కోట్ల విదేశీ రుణంపై కార్పొరేషన్‌లో రాజకీయ రగడ...
విలేకర్ల సమావేశంలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
లక్ష్మీదేవిపల్లి ఆగస్టు6(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం జర్మన్ బ్యాంకు నుంచి రూ.300 కోట్ల రుణం తీసుకునేందుకు డీపీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారనే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజాప్రతినిధులతో కనీస చర్చ కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కౌన్సిల్ ఆమోదం లేకుండానే అభివృద్ధి పేరుతో జర్మన్ బ్యాంకు నుంచి రూ.300 కోట్ల రుణం కోసం డీపీఆర్ ప్రతిపాదనలు పంపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
అభివృద్ధి పేరుతో అప్పుల భారం?
కార్పొరేషన్‌లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ప్రజా అవసరాల కంటే కమిషన్లు, స్వప్రయోజనాల కోసమే విదేశీ రుణాల వైపు పాలకవర్గం మొగ్గు చూపుతోందని ఆరోపించారు. ప్రజలపై భవిష్యత్తులో అప్పుల భారం మోపే నిర్ణయాలను తొందరపాటుగా తీసుకోవడం సరికాదన్నారు.
డీపీఆర్ రద్దు చేయాలని డిమాండ్
ఇప్పటికైనా ఏకపక్ష నిర్ణయాలను విరమించి, రూ.300 కోట్ల రుణ ప్రతిపాదనను కౌన్సిల్ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని కోరారు. ప్రజలకు మేలు జరిగేలా అన్ని రాజకీయ వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు జర్మన్ బ్యాంకు రుణానికి సంబంధించిన డీపీఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై మున్సిపల్ పాలకవర్గం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, పాల్వంచ మండలాధ్యక్షుడు రాపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.






