7 August, 2026 | 3:07 AM

కత్తులన్నీ కటకటా.. నెత్తురంతా చిటపటా.. దిష్టంత పోవాలే..

07-08-2026 01:59 AM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ టీజర్ అత్యంత ఊరమాస్, వయొలెంట్ ఎలివేషన్లతో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గురువారం విడుదలైన ఈ 95 సెకన్ల మ్యాడ్నెస్ టీజర్‌లో నాని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రగ్గడ్, రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు.

అతని రెండు జడల హెయిర్ స్టుల్, చేతిపై ఉన్న టాటూ, వణుకు పుట్టించే మేకోవర్ టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అర్బన్ స్లమ్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో డైలాగ్స్ అత్యంత బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. పాత్ర తీవ్రతను చూపించేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎక్కడా వెనకాడలేదు. దర్శకుడు ముందే చెప్పినట్లుగా, ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, రక్తపాతం నెక్స్ లెవెల్లో ఉన్నాయి. 10 కేజీఎఫ్ సినిమాలతో సమానమైన హైప్ క్రియేట్ చేసేలా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు.

‘అణచబడ్డ మన జాతి మర్లవడాలే.. ఛీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా.. కాకే దాని మీద గుర్తు.. థూ అనిపించుకున్న జాతులు తల్వార్లు పడితే ఏమైతదో చూపిద్దాం.. ఈ జాగా మనదే.. ఈ దేశం మనదే..’ అంటూ చెప్పిన డైలాగ్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. టీజర్ చివరలో ‘ఇరుగు దిష్టి పొరుగు దిష్టి.. నల్లికుట్ల్లోని దిష్టి  బెదురు గుడ్లోని దిష్టి.. కత్తులన్ని కటకటా.. నెత్తురంతా చిటపటా.. దిష్టంత పోవాలే..’ అంటూ చెప్పిన డైలాగులు తెలంగాణ ఆచారాలను గుర్తుచేస్తోంది.

ఇప్పటికే ‘ఆయా షేర్’ సాంగ్‌తో సంచలనం సృష్టించిన అనిరుధ్ రవిచందర్, ఈ టీజర్‌కు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. శ్రీకాంత్ ఓదెల తన మార్క్ రా అండ్ రియలిస్టిక్ మేకింగ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమాలో నాని సరసన కాయదు లోహర్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ ముఖ్య పాత్రలో బాలీవుడ్ తరహా ఇంటెన్సిటీని తీసుకొచ్చారు.

మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్‌బాబు, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండేలా నిర్మించారు. మొత్తానికి ఈ టీజర్ మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ లాంటిది. ఈ పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా 8 భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది.