సరిపడా ఎరువుల కోసం ముందే ప్లాన్
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి విత్తనాల కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేశారా, అవి రైతులకు చేరాయా లేదా అని తనిఖీలు చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి సరిపడా ఎరువులు రెండు నెలల ముందుగా తెప్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ కంపెనీలు అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రిప్, స్ప్రింకర్ల సౌకర్యం కేవలం ఆయిల్ ఫామ్ పంటలే కాకుండా ఇతర పంటలకు వర్తింపజేసేలా విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఇతర శాఖలోని ప్రభుత్వ భూములు కేటాయింపులకు అనుగుణంగా లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉపయోగంలోకి తీసుకుని రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల నుంచి ఇప్పటివరకు రైతులకు అందించిన విత్తనాలు, ఎరువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పచ్చిరొట్ట విత్తనాలపై విత్తనాభివృద్ది సంస్థ ఎండీ హరిత 61.15 కోట్ల విలువైన 1,09,937 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని, ఇంకా అవసరం మేరకు విత్తనాలు తెప్పిస్తామన్నారు.
గతేడాది జూన్ 15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచగా, ఈ సంవత్సరం 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు , ఇప్పటివరకు రైతులు 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. అనంతరం వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ మాట్లాడుతూ.. జూన్, జూలై నెలల అవసరాల మేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచామని, 7,97,194 టన్నుల యూరియా, 75,278 టన్నుల డీఏపీ, 4,27,057 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 టన్నుల మ్యూరెట్ ఆప్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యానశాఖ డెరెక్టర్ అశోక్‌రెడ్డి వివరిస్తూ ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని కంపెనీలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందర్‌రావు, హెచ్‌ఏసిఏ ఇన్‌చార్జి ఎండీ సత్యశారద, అగ్రో ఎండీ రాములు, వేర్‌హౌస్ ఎండీ జితేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






