సీతారాముల కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి
నేడు సీతారాముల కల్యాణోత్సవం, రేపు పట్టాభిషేకం
దేశ వ్యాప్తంగా భద్రాద్రికి తరలివస్తున్న భక్తులు
భద్రాచలం, మార్చి 26, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భద్రుని కొండపై నిలవైన భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తుండటంతో భద్రాచలం కల్యాణ శోభతో కళకళలాడుతోంది. ఎటు చూసినా స్వాగత ద్వారాలు... చలువ పందిళ్లు, అలంకరణలు దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్న రామాలయ ప్రాంగణం. మొత్తంగా భద్రాచల రామక్షేత్రం భూలోక వైకుంఠంగా భక్తు లకు దర్శనమిస్తోంది.
ఎటు చూసినా సీతారాముల కళ్యాణ శోభ.... ఎవరి నోట విన్నా అది దంపతుల ముచ్చటే... శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మిథిల స్టేడియంలోని శిల్పకళా శోభిత మైన కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రామయ్య సన్ని దికి చేరుకుంటున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నారు.
అలాగే 370 కోట్లతో రామాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎదుర్కోలు, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం పురస్కరించుకొని స్వామివార్లను తీసుకెళ్లే మార్గంలో దేవస్థానం, పోలీసులు సంయుక్త ఆధ్య ర్వంలో విస్తృత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ సుమారు రెండువేల మందికి పైగా సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నారు. కాగా దేవస్థానం ఆధ్వర్యంలో మూడు లక్షల లడ్డూ లను సిద్ధం చేస్తున్నారు. 26 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాద విక్రయాలు, 80 కౌంటర్ల ద్వారా నవమి కళ్యాణ తలంబ్రాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా కళ్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించగా 34 వేల మంది భక్తులు కల్యాణంను వీక్షించనున్నారు. కాగా ఇందులో 15000 మంది భక్తులు ఉచితంగా స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుంది. కల్యాణ మండపం ప్రాంగణంలో 50 టన్నుల ఏసీ, 150 కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్నాన్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణానికి రాగా, గవర్నర్ పట్టాభిషేకం తిలకించడానికి వస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికార యంత్రాంగం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసింది అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కళ్యాణం తిలకించి తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లేలా జిల్లా అధికార యంత్రాంగం తో పాటు ఆర్టీసీ విస్తృత రవాణా సౌకర్యం కల్పించింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కళ్యాణ తుది ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేర్పులు మార్పులు సూచించి శుక్రవారం జరిగే కళ్యాణానికి ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ఐక్యంగా కృషి చేయాలని అధికారి యంత్రాంగాన్ని కోరారు.




