భగత్ సింగ్ త్యాగ స్పూర్తితో పోరాడాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుడు భగత్ సింగ్ (Bhagat Singh) వర్ధంతి సందర్భంగా సోమవారం బైక్ ర్యాలీ, సభ నిర్వహించారు. ప్రజా సంఘాల కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ మార్కెట్ ప్రాంతం గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో భగత్ సింగ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్ మాట్లాడుతూ దేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాకుండా రైతులు, కార్మికులు శ్రమదోపిడీ లేని సమాజంలో జీవించేలా పోరాడాలనే లక్ష్యంతో భగత్ సింగ్ ఉద్యమం సాగించాడన్నారు.
సామాజిక సమానత్వం కోసం సోషలిజమే మార్గమని ఆయన విశ్వసించాడని పేర్కొన్నారు. జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ కీలక పాత్ర పోషించాడని, “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో యువతలో పోరాట స్పూర్తిని నింపాడన్నారు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు రాజ్ గురు (Shivaram Rajguru), సుఖ్ దేవ్ (Sukhdev Thapar) లను స్మరించుకున్నారు.
ప్రస్తుత కాలంలో సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ లౌకిక విధానాన్ని కాపాడుకోవడం ద్వారా భగత్ సింగ్‌కు నిజమైన నివాళి అర్పించగలమని తెలిపారు. యువత భగత్ సింగ్ ఆశయాలను అధ్యయనం చేసి ఆయన రచనలను చదవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ కుమార్, రాజేందర్, తికానంద్, మాల శ్రీరాజ్ కుమార్, తిరుపతి, మనోహర్, శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




