వారి భరతం పడతాం: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్: శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని నీటి సరఫరాకు కీలకమైన గండిపేట, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల చుట్టూ ఉన్న అక్రమ భవనాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సరస్సుల సమీపంలో కొందరు సంపన్నులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుని అక్రమంగా గండిపేటలోకి డ్రైనేజీని మళ్లించారని తెలిపారు. శ్రీకృష్ణుడు చెప్పిన సూత్రాలను పాటిస్తూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సరస్సులను, ఇతర ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న వ్యక్తుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడారు.
ఈ కూల్చివేతలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా, హైదరాబాద్ వనరులను కాపాడేందుకేనని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఆక్రమణదారుల ఒత్తిళ్లకు, సంబంధాలకు ప్రభుత్వం తలొగ్గబోదని హామీ ఇచ్చారు. మా సరస్సులను ఎవరైనా అక్రమంగా ఆక్రమించిన వారు ఎంతటి శక్తిమంతమైన వారైనా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజా వనరులను కాపాడటంపైనే ఉన్నాయని, రాజకీయ ఉద్దేశ్యాలతో కాదని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావం ఉన్నా సరస్సుల నుంచి అక్రమ కట్టడాలను తొలగించాలని రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు.






