అమెరికాలో పాలస్తీనా కలకలం

30-04-2024 12:10:00 AM

ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతుంటే అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకూ తీవ్రమ వుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో భారత్‌సహా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతు తెలియజేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ ఆవరణలోనే శిబిరాలు సైతం ఏర్పాటు చేసుకుని పాలస్తీనాకు అనుకూలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీలో మొదలైన నిరసనలు దాదాపు అమెరికా వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు  విస్తరించాయి. విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు, వర్సిటీల అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత పది రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది ఆందోళనకారులను పోలీసులు అరె స్టు చేశారు. వీరిలో కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో అమాయకులైన పాలస్తీనా పౌరులు మృతి చెందుతుండడంపై విద్యార్థులు నిరసనలు తీవ్రం చేస్తున్నా రు.

ఇప్పటికే గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మృతి చెందగా గాజా నగరం సగానికి పైగా ధ్వంసమైంది. ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ధ్వంసమైన నివాస భవనాలే దర్శనమిస్తున్నాయి. చివరికి ఆస్పత్రులు సైతం ఇజ్రాయెల్ భద్ర తాదళాల దాడులకు బలవుతున్నాయి. లక్షలాది మంది తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రపంచ దేశాలు అందించే సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలవడంపై అమెరికాలోని విద్యార్థులు మండి పడుతున్నారు. గాజాపై దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబం ధాలను తెగదెంపులు చేసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 18న న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూని వర్సిటీలో జరిగిన సామూహిక అరెస్టుల తర్వాత అమెరికా వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో సుమారు 900 మందిని అరెస్టు చేసినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. బోస్టన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ, ఇండియానా యూనివర్సిటీ, సెయిం ట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీల్లో శనివారం ఒక్కరోజే 200 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. వివిధ వర్సిటీ క్యాంపస్‌లలో  ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనకారులు పోలీసు అధికారులతో ఘర్షణకు దిగడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ముఖ్యంగా లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆందోళనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న వీడి యో సంచలనంగా మారింది. తాజాగా ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో నిరసనకారులు పాలస్తీనా జెండా ఎగరేయడం కలకలం సృష్టిస్తోంది. శనివారం సాయంత్రం కొందరు ఆందోళనకారులు అక్కడి జాన్ హార్వర్డ్  విగ్ర హంపై పాలస్తీనా జెండా ఎగరేసి నిరసన తెలియజేశారు. ఆ ప్రదేశంలో అమెరికా జెండాను మాత్రమే ఉంచుతారు.  అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎవరైనా విదేశాలకు చెందిన ప్రముఖులు వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. తాజాగా ఆందోళనకారులు అమెరికా జెండా ను పక్కన పెట్టి అక్కడ పాలస్తీనా జెండాను ఎగరేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు సైతం ఈ ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందిం చారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ ఆందోళనల్లో విద్యార్థులు, యూనివర్సిటీల్లోని బోధనా సిబ్బంది  కలిసి పాల్గొంటుండడం విశేషం. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ఇప్పటికిప్పుడే ముగింపు కనిపించక పోవడంతో ఈ నిరసన ప్రదర్శనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.