19-12-2025 08:56:35 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి పోచారం సర్కిల్ పరిధిలోని యంనంపేట్ శ్రీరంగనాయక స్వామి దేవాలయం సిబ్బందికి భాగ్యనగర అర్చక పురోహిత సంఘం మద్దతు తెలిపింది. కొంతకాలంగా ఆలయ నిర్వాహణ ఉద్యోగులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న విషయం తెలుసుకున్న భాగ్యనగర అర్చక పురోహిత సంఘం గురువారం ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారికి మద్దతు ప్రకటించారు.
ఆలయ నిర్వహణకు సంబంధించిన లెక్కలు సక్రమంగా చూపిన తర్వాత కూడా ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాగ్యలక్ష్మితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనీషా, పూజారి రాఘవాచార్యులను ఆలయ చైర్మన్ భర్త, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగడం బాధాకరమన్నారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేయాల్సిన దేవాలయ కమిటీ అందుకు విరుద్ధంగా పనిచేయడం ఏమిటని ప్రశ్నించారు. దేవాలయ అభివృద్ధి పనుల్లో స్వార్ధ రాజకీయాలు చేస్తూ తాము చెప్పినట్లు నడవడంలేదని దూషించడం మంచిది కాదన్నారు. ఇలా చేసినట్లయితే ఆలయానికి భక్తులు తగ్గుతారని దీంతో ఆదాయం తగ్గుతుందని కావున ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని పేర్కొన్నారు.