16 July, 2026 | 9:04 AM

ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి

21-06-2024 01:37 AM

బీజేపీ నేతను నియమించిన రాష్ట్రపతి

ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నేత

న్యూఢిల్లీ, జూన్ 20: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 (1) ప్రకారం లోక్‌సభ రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నుకొనేవరకు సభా కార్యకలాపాలను నిర్వహించేందుకు రాష్ట్రపతి సభలోని సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. స్పీకర్ ఎన్నిక పూర్తవగానే ఈ పదవి రద్దయిపోతుంది. 18వ లోక్‌సభ తొలి సమావేశం ఈ నెల 24న ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

దీంతో సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒడిశాకు చెందిన భర్తృహరి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయన బీజేడీ నుంచి బీజేపీలో చేరి కటక్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈయన ఒడిశా మాజీ సీఎం హరేకృష్ణ మహతాబ్ కుమారుడు. కటక్ నుంచి 1998, 1999, 2004, 2009, 2014, 2019, 2014 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2017లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకొన్నారు. సభలో అర్థవంతమైన చర్చలు నిర్వహించినందుకుగాను 2017  మధ్య వరుసగా నాలుగేండ్లు సంసద్ రత్న అవార్డులు ఈయనకు లభించాయి.