16 July, 2026 | 9:15 AM

కశ్మీర్‌కు రాష్ట్ర హోదా

21-06-2024 01:36 AM

త్వరలోనే మీకు సొంత ప్రభుత్వం

కశ్మీరీలకు ప్రధాని మోదీ హామీ

యూటీలో రెండురోజుల పర్యటన

నేడు యోగా దినోత్సవానికి హాజరు

శ్రీనగర్, జూన్ 20: కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లో ౨ రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం ఆయన శ్రీనగర్ చేరుకొన్నారు. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇక్కడ పర్యటిస్తుండటంతో బీజేపీ శ్రేణులు ప్రధానికి ఘనస్వాగతం పలికాయి.

అనంతరం శ్రీనగర్‌లోని షేర్ ఏ కశ్మీర్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ముకశ్మీర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మీ ఓటు ద్వారా మీరే మీ సొంత ప్రభుత్వాన్ని త్వరలోనే ఎన్నుకొంటారు’ అని ప్రకటించారు. ‘అభివృద్ధి పనుల కోసం, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రజలు పాల్గొన్న తీరును చూసే పర్యటనకు వచ్చాను’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు భారీఎత్తున తరలివచ్చి ఓట్లేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

మార్పు మొదలైంది

కశ్మీర్‌లో మార్పు మొదలైందని ప్రధాని అన్నారు. ‘కశ్మీర్ లోయలో వస్తున్న మార్పులను ప్రపంచమంతా చూస్తున్నది. మన కశ్మీర్ ఎంత ముందుకు పోయిందో? ఇక్కడ నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబురాలు పర్యాటకులను అమితంగా ఆకర్శించటాన్ని మీరు చూస్తారు. గత పదేండ్లలో మనం చేసిన పనికి నేడు ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు.  

నేడు యోగా డే వేడుకలు

ప్రధాని మోదీ శుక్రవారం శ్రీనగర్‌లో యోగాడే వేడుకల్లో పాల్గొంటా రు. ఉదయం 6.30కు ప్రజలతో కలిసి యోగా చేస్తారు. అనంతరం రూ.80 వేల కోట్లతో జమ్ముకశ్మీర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 2వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తారు. రూ.1,500 కోట్లతో చేపట్టిన 84 అభివృద్ధి పనులకు పునాది రాళ్లు వేస్తారు. ఇటీవల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో వరుస ఉగ్రదాడులు జరుగటంతో ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత కల్పించారు.