రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) విద్యుత్, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పలు కీలక పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అడవి మద్దులపల్లి గ్రామంలో రూ.2.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ ఉపకేంద్రం ద్వారా పరిసర ప్రాంతాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కానుందని తెలిపారు.
అనంతరం రూ.3.95 కోట్ల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు, అలాగే రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు ఆర్అండ్ బీ రహదారి నుంచి కామేపల్లి స్మశాన వాటిక వరకు, కామేపల్లి పెద్ద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు, సురక్షితమైన రహదారులు, వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.






