పీవీ సింధుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
పీవీ సింధు దేశ యువతకు స్ఫూర్తి
హైదరాబాద్: జపాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Japan Open Super 750 Badminton Tournament) మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును(PV Sindhu) తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కెరీర్‌లో తొలి సూపర్-750 టైటిల్‌ను సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత(Olympic medal winner) అయిన పీవీ సింధు, తన అద్భుతమైన దూకుడు బ్యాడ్మింటన్ ప్రదర్శనతో స్థానిక క్రీడాకారిణి అకానె యమగుచిని వరుస గేమ్‌లలో 21-17, 21-17 తేడాతో ఓడించి, టోక్యోలో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచింది. సింధు చివరిసారిగా 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.






