23 March, 2026 | 1:58 AM

భీం పోరాటం అందరికీ ఆదర్శం

08-10-2025 12:21 AM
  1. ఆదివాసిల సంక్షేమానికి రూ.740 కోట్లు 

గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కుమ్రంభీం 

మంత్రి జూపల్లి కృష్ణారావు

జోడేఘాట్‌లో కుమ్రంభీం వర్ధంతి

వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసి గిరిజనులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబరు 7 (విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కుమ్రంభీం 85వ వర్ధంతిని మంగళవారం జోడేఘాట్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌కు వేలాదిగా ఆదివాసీలు తరలివచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించారు.

గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కుమ్రంభీం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రజాదర్బార్‌ను రద్దు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం రూ.740 కోట్లు గత 15 రోజుల క్రితం విడుదల చేసినట్లు తెలిపారు.

కుమ్రంభీ పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన పోరాటాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధారణంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆశ్రమ పాఠశాలల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..

జల్, జంగల్, జమీన్ కోసం నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రంభీం గొప్ప వీరుడని కొనియడారు. చదువు, పోరాడు, సాధించు అనే అంబేద్కర్ నినాదాన్ని తీసుకున్న కుమ్రంభీం నేడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడని చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, భీం మనుమడు సోనేరావు కుటుంబ సభ్యులతో కలిసి గిరిజన సంప్రదాయ రీతిలో జెండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి , సమాధి వద్ద, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భీం మనుమడు సోనేరావు కుటుంబ సభ్యులకు సంప్రదాయ బద్ధంగా నూతన వస్త్రాలను అందజేశారు. కుమ్రంభీ ఆశయాలు కొనసాగించాలని ఆయన మనుమడు -సోనేరావు కోరారు. ఏజేన్సీలో ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని, అసంపూర్తిగా ఉన్న జోడేఘాట్ రోడ్డును పూర్తి చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు.