calender_icon.png 8 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు

08-10-2025 12:19:12 AM

  1. నవయుగ, కృషి సీడ్స్ సంస్థలపై పన్ను ఎగవేత ఆరోపణలు
  2. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో ఏకకాలంలో సోదాలు 
  3.   40కి పైగా బృందాలతో తనిఖీలు
  4. కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
  5. మరో రెండ్రోజులు సోదాలు! 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రముఖ వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను ఐటీ శాఖ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో, మౌలిక సదుపాయాల నిర్మా ణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, విత్తన రంగంలోని కృషి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో మెరుపు దాడులు ప్రా రంభించారు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని కార్యాలయాలు, కీలక వ్యక్తుల నివాసాలపై 40కి పైగా బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా టన్నెల్ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తున్న నవయుగ సంస్థ, భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

దీంతో హైద రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న కార్పొరేట్ కార్యాలయం, సంస్థ చైర్మన్ సి విశ్వేశ్వరరావు నివాసంతో పాటు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో విజయవాడ, విశాఖపట్నంలోని నవయుగ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమ య్యాయి.

మరోవైపు, హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తున్న కృషి సీడ్స్ కార్యాలయాలు, ఎండీ, డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఉదయాన్నే కార్యాలయాలకు చేరుకున్న అధికా రులు, సిబ్బందిని బయటకు పంపకుండా, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు.

కీలక పత్రాలు స్వాధీనం

ఈ సోదాల్లో భాగంగా రెండు కంపెనీలకు చెందిన కీలకమైన ఆర్థిక లావాదేవీల పత్రాలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కంపెనీల ఆదాయానికి, చెల్లిస్తున్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయితేగానీ పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.