14 March, 2026 | 2:11 AM

భూదాన భూములను పేదలకు పంచాలి

14-03-2026 12:56 AM
  1. అమ్ముకుంటున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి 
  2. మాజీ ఎంపీ అజీజ్ పాషా 

హైదరాబాద్, మార్చి13 (విజయక్రాంతి) : రాష్ట్రంలో వెంటనే భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి భూదాన భూములను పేదలకు పంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ సర్వోదయ మండలి సలహాదారు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా విజ్ఞప్తి చేసారు. తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్‌నాయక్ అధ్యక్షతన మండలి రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సయ్యిద్ అజీజ్ పాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు పంచేందుకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య వినోబాభావే భూస్వాముల నుంచి సేకరించిన దాదాపు 1,79,000 ఎకరాల భూమి అప్పట్లో కొద్దిమంది నిరుపేదలకు పంచగా మిగిలిన వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్నారు. 2014 లోనే భూదాన యజ్ఞబోర్డును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, కొంతమంది పదవిలో లేకున్నా అనధికారంగా నకిలీ ప్రొసీడింగ్స్ జారీచేసి భూదాన భూ ములను అమ్ముకుంటున్నారని, వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

సర్వోదయ మండలి అధ్యక్షులు శంకర్‌నాయక్ మాట్లాడుతూ భూమి లేని  పేదలకు పంపిణి చేయవలసిన వెలది ఎకరాల భూమి భూబకాసురుల కోరల్లో పడి అన్యాక్రాంతమవుతుందన్నారు. భూదా న భూ మాఫియా కింగ్ పేరొందిన భూదాన యజ్ఞ బోర్డు మాజీ చైర్మన్  రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది పేదల నుంచి కోట్ల రూపాయలను దండుకొని భూదాన భూ ములపై ఇప్పటికి నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ పేదప్రజలు మోసగిస్తున్నాడని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.