15 July, 2026 | 2:40 PM

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు నానో ఎరువులు వాడాలి

15-07-2026 02:38 PM

- ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

తాంసి, (విజయక్రాంతి) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడక నేలలో తేమ లేని కారణంగా, రైతులు నేల ద్వారా కాకుండా మొక్కల పైభాగం నుంచి స్ప్రే చేసే ఎరువులను వాడటం ఉత్తమమని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలను, ఎరువుల దుకాణాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. మొక్కలపై నేరుగా స్ప్రే చేసే నానో యూరియా, నానో డీఏపీ (Nano DAP) వాడాలని, డీఏపీ కొరత ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులను వినియోగించుకోవచ్చన్నారు. భాస్వరం కావాలనుకునే వారు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడవచ్చని, రైతు బిడ్డగా వ్యవసాయంపై తనకు అవగాహన ఉందని, రైతులెవరూ ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారుల, ఏఈఓల సూచనలు పాటించి ఆధునిక పద్ధతుల్లో ఎరువులను ఉపయోగించాలన్నారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ కౌడలా నారాయణ, మార్కెట్ కమిటీ మెంబెర్ ధనుంజయ్, తాంసి మాజీ ఎంపీటీసీ నరేష్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, రామన్న యాదవ్, రఘు రెడ్డి, అశోక్, రవి,  చిన్నరాములు, నరేష్ పంతులు, ఆశన్న రైతులు తదితరులు ఉన్నారు.