18-02-2026 08:01:44 PM
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భూభారతిలో భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి కలెక్టరేట్ భవన సముదాయంలోని విభాగంలో గల సెక్షన్ల పర్యవేక్షకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భారతి పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులను తహసిల్దార్ నుండి వచ్చిన ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, తిరస్కరించే ఫైళ్ళకు తగిన కారణాలు వివరంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కారుణ్య నియామకాల క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నివేదికలు అందించాలని తెలిపారు.
చెరువులు, కాలువలు, వివిధ అభివృద్ధి పనుల కొరకు సేకరించే భూములకు త్వరగా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, కోర్టు కేసులపై దృష్టి సారించాలని తెలిపారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు, ఎయిర్ టెల్, బిఎస్ఏఎన్ఎల్ టవర్ల నిర్మాణాలకు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా భూ కొలతల అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్, పలు విభాగాల పర్యవేక్షకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.