18-04-2025 01:23:38 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రైతుల భూములకు సంబంధించిన పలు రకాల సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించేందుకే భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం బుగ్గారం, కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలాల్లోని రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం) -2025 పై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరై ప్రసంగించారు.
ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ధరణి పోర్టల్లో అనేక సమస్యలకు దొరకని పరిష్కారం, భూ భారతి చట్టంలో దొరుకుతుందన్నారు. జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని, భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడ ఫిర్యాదులు సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్లు మజీద్, ప్రసాద్, రెవిన్యూ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.