భువనగిరి.. హోరాహోరీ
కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ?
త్రిముఖ పోరులో గెలుపు ధీమాతో బీఆర్‌ఎస్
యాదాద్రి భువనగిరి, మే 13 (విజయక్రాంతి): భువనగిరి పార్లమెంట్ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. పోలింగ్ సరళి ప్రకారం కూడికలు, తీసివేతలు వేస్తూ గెలుపు మాదంటే మాదే అంటున్నాయి. ఈ స్థానంలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్య ర్థులు ఎన్నికల క్షేత్రంలో పోరాడారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగించారు.
అయితే సోమవారం నాటి పోలింగ్ సరళి ప్రకారం విజయం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. పోలింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని, ఓటర్లు తమవైపే ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటుండగా.. లేదు లేదు మోదీ ప్రభావంతో బీజేపీ వైపే మొగ్గారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే బలమైన తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని, ముక్కోణపు పోటీలో తమదే గెలుపు అని బీఆర్‌ఎస్ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
పోటాపోటీగా..
భువనగిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గెలుపొందింది. బీజేపీకి ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. పోలింగ్ సరళిని బట్టి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పోలింగ్ జరిగినట్టుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లోని ఉద్యోగ వర్గాలతో పాటు యువకులు, అదే విధంగా హిందుత్వ వంటి అంశాలకు ప్రభావితమైన వర్గాలు పెద్ద ఎత్తున బీజేపీ వైపే నిలిచారని స్పష్టమైతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగ్గా కనిపించినా.. పట్టణాలతో పోలిస్తే బీజేపీకి ఆదరణ తక్కువగానే ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు పూర్తిగా అండగా నిలిచినట్లు అంచనా.
5 గంటల వరకు 72.34 శాతం..
భువనగిరి స్థానంలో సాయంత్రం 5 గంటల వరకు 72.34 శాతం ఓటింగ్ నమోదైంది. తుది లెక్కలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. అయితే పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది మాత్రం ప్రశ్నార్థంగా మారింది.




