అద్భుతమైన పోరాట పటిమ కనబర్చారు
గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం ప్రజలదే
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) ః పార్లమెంటు ఎన్నికల్లో అద్బుతమైన పోరాట పటిమ కనబర్చిన బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలో పరాజయం పాలైన తరువాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడటం ఆషామాషీ వ్యవహారం కాదని, పార్లమెంటు ఎన్నికల్లో అద్బుతమైన నిబద్దతతో పార్టీ అధ్యక్షులు కేసిఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తల తీరు అద్భుతమన్నారు. గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కి, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు.
తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలు ఇస్తుందని, తమ వెంట నడిచిన తెలంగాణ ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా తరువాత ప్రభుత్వాలను నిందిస్తే లాభం లేదన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు హిమాన్షు, సతీమణి శైలిమతో కలిసి ఓటు వేశారు.




