15 August, 2026 | 7:09 AM

రాష్ట్ర గవర్నర్‌గా బీహార్ నేత!

18-06-2024 01:56 AM

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఖాళీగా ఉన్న గవర్నర్ స్థానాల భర్తీపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణకు ఇన్‌చార్జి గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ పుదుచ్ఛేరి, జార్ఖండ్ రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి త్వరలోనే పూర్తి స్థాయి గవర్నర్ వస్తారని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర మాజీ మంత్రి, బీహార్ నేత అశ్వినీకుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్‌గా పంపించేందుకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. 1995లో తొలిసారి బీహార్‌లో ఎమ్మెల్యేగా ఎంపికైన చౌబే, ఆ తర్వాత బక్సర్ నుంచి ఎంపీగాను గెలిచారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గత ఎన్డీయే ప్రభుత్వంలో పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆయనకు అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు.

అయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. పార్టీకి ఎంతో విధేయునిగా చౌబేకు పేరుంది. అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రక్రియలో అశ్వినీకుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తున్నారనే సమాచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. పార్టీకి నమ్మదగ్గ వ్యక్తిగా పేరున్న చౌబేను రాష్ట్రానికి గవర్నర్‌గా పంపనుందని కాషాయ నేతలు కూడా అంటున్నారు. 

  • కిరణ్‌కుమార్‌రెడ్డిపైనా ప్రచారం

సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌ను వీడి, సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి గవర్నర్‌గా వస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ పట్ల వ్యతిరేకత ప్రదర్శించారని పేరున్న కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తే రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పార్టీ రాష్ట్ర నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయినట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం.

గత ఏడాదే పార్టీలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. బీజేపీకి ఆయన చేసిన సేవ ఏంటంటూ పార్టీలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే ఎంతో సేవ చేసిన అనేక మంది నేతలు పార్టీలో ఉన్నారని ముందు అలాంటి వారికి అవకాశం ఇచ్చాక కొత్తగా వచ్చిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక గవర్నర్‌గా అవకాశం వస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.