31 August, 2026 | 11:42 PM

ఫీజు బకాయిలు.. విద్యార్థుల భవితకు సంకెళ్లు!

31-08-2026 10:59 PM

- రాజీవ్‌చౌక్‌లో బీజేపీ, బీజేవైఎం నిరాహార దీక్ష

- బకాయిలు చెల్లించండి.. లేదంటే అసెంబ్లీ ముట్టడే

- బీజేపీ జిల్లా ఇంచార్జీ బొక్క బాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అరవింద్

వనపర్తి,(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం అధ్యక్షుడు అరవింద్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జి బొక్క బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  బీజేపీ జిల్లా ఇంచార్జీ బొక్క బాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అరవింద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బకాయిల కారణంగా పలువురు విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో నిలిచిపోతుండటంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి భారీ ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

దీక్షకు ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అరవింద్, సీనియర్ నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షురాలు అనుజ్ఞారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్, బోలమోని రాములు, జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.