40 ఏళ్ల సేవకు ఘన సత్కారం
ఆసిఫాబాద్(విజయశాంతి): శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 40 ఏళ్లుగా సేవలందించి పదవీ విరమణ పొందిన డెంగ్రే సదయ్యను పాఠశాల ప్రబంధకారిణి, సమితి, జిల్లా, విభాగ్ కార్యకారిణీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. విభాగ్ అకడమిక్ ఇన్‌చార్జి పూదరి సత్యనారాయణ మాట్లాడుతూ.. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ పాఠశాల అయిన శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో సదయ్య నాలుగు దశాబ్దాలుగా సేవాభావంతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సదయ్య దంపతులను ఆచార్య బృందం, ప్రబంధకారిణి సభ్యులు ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సదయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకటేశ్వర్, నాగుల శ్రీనివాస్, కల్లూరి సంతోష్, జంజిరాల శ్రీనివాస్, శ్రీరామ్ సత్యనారాయణ, చిప్ప రమాదేవి, కల్లూరి వైష్ణవి, స్వాతి, జయగౌరి తదితరులు పాల్గొన్నారు.






