23 March, 2026 | 6:55 PM

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్

23-03-2026 03:46 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ నిరసనలో భాగంగా అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును(BJP Chief Ramchander Rao Arrest), పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు భారీ హామీలు గుప్పిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ గత రెండేళ్లుగా, తెలంగాణ ప్రజలు కేవలం మోసం, వంచన, ద్రోహాన్ని మాత్రమే చవిచూశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, పెన్షనర్లు, సమాజంలోని ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదని బీజేపీ ఆరోపించింది.

'ప్రజా పాలన కాదు.. ఇది 1975 నాటి నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిరంకుశ పోకడలను మరోసారి బయటపెట్టుకుంది. నిరసన గళాలను నొక్కేయడం, ప్రతిపక్షాలను నిర్బంధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అబద్ధపు హామీలతో తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహం, వంచనపై ప్రజల పక్షాన గళమెత్తినందుకు నన్ను అరెస్ట్ చేయడం వారి పిరికిపంద చర్యకు నిదర్శనం. అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు బీజేపీ భయపడదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నాడు ఎమర్జెన్సీ.. నేడు ఇందిరమ్మ రాజ్యం.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు!'' అంటూ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.