రిజర్వేషన్ల తొలగింపునకు బీజేపీ కుట్ర

29-04-2024 12:09:45 AM

l రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు

l కేసీఆర్ చేసిన అప్పులకు రూ.29 వేల కోట్ల వడ్డీ కట్టాం

l ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, బీజేపీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితులు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్ మండలం ఆప్పెపెల్లి, అంకుశాపూర్, మోతుగూడ గ్రామాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం కెరమెరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై మండిపడ్డారు. బీజేపీ పాలనలో అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని, బీజేపీ పదేళ్ల కాలంలో దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన అప్పులకు ఇప్పటికే రూ.29 వేల కోట్ల వడ్డీ కట్టామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మాలీ, తేలి కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామని, కేస్లాపూర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని, ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వరకు రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మే 3న జిల్లా కేంద్రంలో నిర్వహించే జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సభలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర శ్యాంనాయక్, నాయకులు బాలేష్ గౌడ్, మునీర్ అహ్మద్, రాథోడ్ గణేష్, చరణ్, కుసుంరావు తదితరులు పాల్గొన్నారు.