24 April, 2026 | 6:32 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

వచ్చే నెలలో ముగియనున్న వీసీల గడువు

29-04-2024 12:10 AM

పోలింగ్ తర్వాత వర్సిటీ వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల గడువు వచ్చే నెలలో ముగియనుంది. కొత్త వీసీల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈలోపే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కోఠి మహిళా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీల నియామకానికి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అయితే వీటిలో కొన్ని వర్సిటీల వీసీల పదవీ కాలం మే 21తో ముగుస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వర్సిటీల పాలకమండలి సభ్యుల (ఈసీ మెంబర్లు) నియామకాలు, సెర్చ్ కమిటీ సమావేశాలు ఆగిపోయాయి.

పోలింగ్ ముగిశాక ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని సెర్చ్ కమిటీలను విద్యాశాఖ అధికారులు నియమించను న్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 10 వర్సిటీలతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలకూ కొత్త వీసీల నియామకాలు చేపట్టనున్నారు. వీసీ పోస్టుల కోసం మొత్తం 1,500 దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. వివాదాలు, రాజకీయ సంబంధాలు లేనివారితో ఓ జాబితాను కూడా రూపొందించారు. ఈ జాబితాను సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హులైన వారి ముగ్గురు పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంది. వాటిని గవర్నర్ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఆతర్వాత వీసీలను ప్రకటిస్తుంది. ఈ సెర్చ్ కమిటీల్లో యూజీసీ, ప్రభుత్వ ప్రతినిధి, యూనివర్సిటీ ఈసీ తరఫు ప్రతినిధులు ఉంటారు. వీసీల పదవీకాలం ముగిసేలోపే వీసీల నియామకాల ప్రక్రియ ఆలస్యమైతే గతంలో మాదిరిగా ఐఏఎస్ అధికారులను యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.