calender_icon.png 11 February, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

11-02-2026 02:11:55 AM

నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆరో వార్డు నుంచి పోటీలో మహదేవప్ప

  1. ఎన్నికల ఖర్చు, రాజకీయ ఒత్తిళ్లు తాళలేక బలవన్మరణం 
  2. అదేవార్డులో కాంగ్రెస్ నుంచి పోటీలో సొంత అన్న
  3. ఎన్నికను వాయిదా వేసిన ఈసీ

నారాయణపేట, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నికల్లో ఖర్చులు, రాజకీయ ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. మక్తల్ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు సొంత అన్నాద మ్ములను తమ పార్టీల నుంచి రంగంలోకి దించా యి.

బీజేపీ నుంచి ఎరుకల మహదేవప్ప(43), కాంగ్రెస్ నుంచి అతడి అన్న, బీఆర్‌ఎస్ నుంచి వారి తమ్ముడు నామినేష న్ వేశారు. బీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసిన తమ్ముడు ఉపసంహరిం చుకోవడంతో పోటీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అన్నాదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు మహదేవప్పను కోరినట్లు తెలి సింది. అయితే లక్ష రూపాయలు  ఖర్చు చేస్తానని, అంతకంటే ఎక్కువ తనతో కాదని సోమవారం పార్టీ శ్రేణులకు మహదేవప్ప చెప్పారని సమాచారం.

దీంతో పాటు ఇతర రాజకీయ ఒత్తిళ్లు కూడా అధికం కావడంతో మనస్థాపానికి గురైన మహదేవప్ప.. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.