04-09-2025 12:14:30 AM
సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 3 : సంస్థాన్ నారాయణపూర్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాచకొండ గుట్టల్లో రిజర్వాయర్ ఏర్పాటు చేసి శివన్నగూడెం ఎత్తిపోతల ద్వారా రైతంగానికి సాగునీరు అందించాలని అన్నారు.
హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోక ఎడారిగా మారింద న్నారు. మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండలంలోని ప్రధాన రహదారులను విస్తరించి లింకు రోడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల ఇక్కట్లు తొలగించాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని లేనియెడల ప్రజల పక్షాన బిజెపి ముందుండి కొట్లాడుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, జక్కలి రాజు యాదవ్, వంగరి రఘు, ఆత్కూరి రాములు, బండమీది కిరణ్ కుమార్, సంపతి సుధాకర్ రెడ్డి, వెలిజాల శ్రీను పాల్గొన్నారు.