తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు
పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట,(విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న తెలంగాణకు ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా ఇవ్వలేదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేస్తూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బీహెచ్ఈఎల్, ఐఐటీ వంటి అనేక కీలక సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయన్నారు. బీజేపీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా రాలేదని, మెట్రో రెండో దశ, ఆర్ఆర్ఆర్ వంటి ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం సహకరించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని చెప్పారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, ఎన్నికల వ్యవస్థపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. తాను రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్‌గా దాదాపు రెండు సంవత్సరాల 23 నెలలు పూర్తి చేసుకున్నానని తెలిపారు. సూర్యాపేట అభివృద్ధికి పర్యాటక శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కోసం 5 కోట్ల రూపాయలు, ఉర్లుగొండ డెవలప్మెంట్ కోసం రెండున్నర కోట్లు, సద్దల చెరువు ప్రాంత అభివృద్ధికి సుమారు రూ.14 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దండు మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కోసం రెండున్నర కోట్ల రూపాయల నిధులు, గిరిజనుల ఆరాధ్య దైవమైన చాంపులాల్ ఆలయ ఫంక్షన్ హాల్ కోసం కోటి 50 లక్షల రూపాయలు, అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కోసం 60 లక్షల రూపాయలు, ఆత్మకూర్ (ఎస్) పురాతన దేవాలయం కోసం త్వరలో 60 లక్షల నిధులు త్వరలో రాబోతున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి సూర్యాపేట అభివృద్ధి చేస్తామన్నారు.






