29 May, 2026 | 1:41 AM

నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త బాస్‌లు

29-05-2026 12:40 AM
  1. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపురకు నూతన అధ్యక్షులు
  2. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికే పదవులు
  3. వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులు

న్యూఢిల్లీ, మే 28: బీజేపీ పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికే పదవులను కట్టబెడుతోంది. ఈ నేపథ్యంలో గురు వారం నాలుగు రాష్ట్రాలకు కొత్త బాస్‌లను నియమించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపురకు అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సారి పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి, కేంద్రమంత్రి హర్ష్‌మల్హోత్రాకు, మాజీ సీఎం అమరీందర్ సింగ్ సన్నిహితుడికి పదవులు దక్కాయి. పార్టీ హర్యానా జనరల్ సెక్రటరీ అర్చనా గుప్తాకు అధ్యక్షురాలిగా ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీ అధ్యక్షుడిగా కొనసాగిన వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో హర్ష్ మల్హోత్రాను నియమించింది. పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం అడుగులేసింది. పంజాబ్ సునీల్ ఝకార్ స్థానంలో కేవల్ సింగ్ దిల్షాన్‌ను అధ్యక్షుడిగా చేసింది.

హర్యానా మోహన్ లాల్ బదోలి స్థానంలో అర్చనా గుప్తా, త్రిపురకు అధ్యక్షుడిగా కొనసాగిన రజీబ్ భట్టాచార్జీ స్థానంలో అభిషేక్ దేవ్‌రాయ్‌ను నియమించింది. పంజాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేవల్ సింగ్ దిల్షాన్ గతంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌లో పనిచేశారు. తరువాత రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈయన మాజీ సీఎం అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. ఢిల్లీ హర్ష్ మల్హోత్రా తొలిసారిగా ఎంపీగా గెలిచారు. పార్టీ కోసం చాలా శ్రమించడంతో ఆయనను అధ్యక్ష పదవి వరించింది. ప్రస్తు తం కేంద్రమంత్రిగా కూడా కొనసాగుతున్నారు.

ఇక హర్యానా అధ్యక్షురాలిగా ఎన్ని కైన అర్చనా గుప్తా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఆమెకు ఈసారి అధ్యక్షురాలిగా ప్రమోషన్ లభించినట్లయ్యింది. త్రిపుర లో అత్యంత కీలక నియోజకవర్గమైన మతార్బారి నుంచి పోటీ చేసి గెలిచిన రజీబ్ భట్టా చార్జీకి అధ్యక్ష స్థానం లభించడం పట్ల రాష్ట్రం లో కమలం పార్టీలో మరింత జోష్ రానుందని భావిస్తున్నారు. తొలిసారి ఎంపీ అయిన హర్ష్ మల్హోత్రాకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి హర్ష్ మల్హోత్రా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

దేశ రాజధానిలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు మల్హోత్రాను అధ్యక్షుడిగా ప్రకటించారు. పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. సిక్కు ప్రాతినిథ్యాన్ని చాటి చెప్పే వ్యూహాత్మక రచనలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్న బర్నాలా మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్‌కి అధ్యక్ష పదవి కట్టబెట్టింది. జూన్, జూలైలో కూడా ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంస్థాగతంగా మార్పు లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలకే పదవులు వరించనున్నట్లు సమాచారం.