15-10-2025 08:14:52 PM
సిపిఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): పార్లమెంట్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు వెంటనే చట్టాన్ని చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బిసి హక్కుల సాధన సమితి, సిపిఐ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం గరిడేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవోను తీసుకొచ్చి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆమోదించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయని ఆయన తెలిపారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ,అగ్రవర్ణాలకి పెద్దపీట వేస్తూ,బీసీలను విస్మరిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం బీసీలను కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీలను ఇంకెన్ని సంవత్సరాలు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం తాసిల్దార్ బండ కవితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,ప్రధాని సైదులు, చిక్కుల సైదులు, పోకల ఆంజనేయులు, అంబటి వెంకటరెడ్డి, అంబటి గోవిందరెడ్డి, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, మంగళపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.