బీజేపీ స్వదేశీ పార్టీ.. కాంగ్రెస్ విదేశీ పార్టీ

29-04-2024 12:16:53 AM

రెండు పార్టీల మధ్యే లోక్‌సభ ఎన్నికల పోరు

మా పార్టీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం

మేం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు

ఎంపీ బండి సంజయ్

హుజూరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): స్వదేశీ పార్టీ బీజేపీ, విదేశీ పార్టీ కాంగ్రెస్ అని, ఈ రెండు పార్టీల మధ్యే లోక్‌సభ ఎన్నికల పోరు అని ఎంపీ బండి సంజ య్ స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే కాంగ్రెస్ తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తామనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం తో ఉన్నారని, ఆ దృష్టిని మళ్లించేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాం గం వ్యతిరేకమైనప్పటికీ, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు అమలయ్యాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచుతామ న్నారు.

కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రచా రం చేస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నాడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని, అయినా ఆయన్ను కాంగ్రెస్ నేతలు ఏమీ అనలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జీవించిన కాలంలో ఆయన్ను ఎంతో ఇబ్బందిపెట్టిందని, ఆయన్ను ఎన్నికల్లో ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నిందని ఆరోపించారు. చివరకు అంబేద్కర్ కాలం చేస్తే ఆయన పార్థీవ దేహాన్ని ఢిల్లీలో ఉండనీయలేదన్నారు. చివరకు పార్థీవ దేహాన్ని ముంబైకి పంపించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే భరోసా ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించుకోలేదన్నారు.

హైదరాబాద్‌లో ఉంటూ బీఆర్‌ఎస్‌కు సేవలు చేయడం తప్ప ఆయనకేమీ తెలియదని విమర్శించారు. ఇక కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. తాను పక్కా లోక ల్ అని,  బీఆర్‌ఎస్ అభ్యర్థి పక్కా నాన్ లోక ల్ అన్నారు. బీఆర్‌ఎస్ అధినేతకు కేసీఆర్‌కు దోచుకోవడం, తన కుటుంబానికి దాచి పెట్ట డం తప్ప ప్రజలు చేసిందేమీ లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయినప్పుడు సీఎంగా కేసీఆర్ పైసా సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిన్నా ఆలోచనలను అమలు చేస్తోందన్నారు. ప్రచారం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు మాడ గౌతమ్‌రెడ్డి, గంగిశెట్టి రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మతపరమైన కోటాకు మేం వ్యతిరేకం

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్ర వర్ణాల్లోని పేదలకు పంచుతాం. మేం అధికారంలోకి వస్తే మొత్తంగా రిజర్వేషన్లను రద్దు చేస్తామనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.