రాష్ట్రంలో సూర్యప్రతాపం
నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 45 డిగ్రీలు
హైదరాబాద్,ఏప్రిల్ 28(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతల పెరుగుదల గణనీయంగా ఉంది. గతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీల వరకే ఉండేవి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభం నుంచే 42 డిగ్రీల నమోదు కావడం గమనార్హం. పెరుగుతున్న ఎండలతో సామాన్య జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరో నాలుగైదు రోజులు వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అదే సమయంలో వడగాలులు కూడా వీస్తాయని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, నల్గొండ జిల్లా ల్లో అత్యధికంగా 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా రంగారెడ్డి, మెదక్ 42 డిగ్రీలు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం అత్యధికంగా 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో మూడు రోజులు నగరంలో పొడి వాతావరణం నెలకొంటుందని అధికారులు తెలిపారు.






