పదేళ్ల బీజేపీ పాలనలో ప్రగతి శూన్యం

29-04-2024 12:15:36 AM

పదేళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. 

దేశంలో మొదటి దశ ఎన్నికల తర్వాత మోదీలో భయం కనిపిస్తుంది

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్/సిద్దిపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పదేళ్ల బీజేపీ పాలనలో ప్రగతి శూన్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులెత్తేశారని, నల్లధనం బయటకు తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి కనీసం ఒక్కరి ఖాతాలో అయినా వేశారా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచడం వంటివి పథకాలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

నియంతకు, త్యాగధనులకు మధ్య పోరాటం..

పార్లమెంట్ ఎన్నికల్లో నియంత మోదీకి, దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వారసుల మధ్య పోరాటం జరుగుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో మొదటి విడత ఎన్నికల తర్వాత ప్రధాని మోదీలో భయం కనిపిస్తుందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు పంచుతారని బీజేపీ ప్రచారం చేస్తోందని, గత 50 ఏళ్లలో ఎప్పుడైనా అలా చేశామా అని ప్రశ్నించారు. పదేళ్లలో అదానీ, అంబానీలకు తప్ప ప్రజలకు ఏమైనా చేశారా అని అడిగారు. బీజేపీ హయాంలో విద్య, ఉపాధి రంగాల్లో ఏ మార్పు రాలేదని, కాంగ్రెస్ పథకాలనే మార్పులు చేసి కొనసాగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 300 మంది మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.