బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, మే 2 : మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడంతోపాటు రిజర్వేషన్లు తొలగిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. గురువారం ఎల్బీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ బీజేపీ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. పదేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఏడాది రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని, నల్లధనం తెచ్చి ప్రజలకు పంచుతామని మోసపూరిత హామీలు ఇచ్చారని విమర్శించారు. పదేండ్ల కాలంలో రూ.57లక్షల కోట్లు ఉన్న దేశ అప్పును రూ.180 లక్షల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యం మనుగడ ఉందని, అన్నివర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను చూసి, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రజలకు మరింత సేవ చేయడానికే కాంగ్రెస్‌లో చేరానని, తనపై వస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ పథకాలకు ప్రజలు అకర్షితులు అవుతున్నారని తెలిపారు. వనస్థలిపురం డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు ముద్దగొని రామ్మోహన్‌గౌడ్, సుజాతానాయక్, గజ్జి భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




