2 May, 2026 | 9:38 AM

తెలంగాణకు అస్తిత్వ పరీక్ష

06-06-2024 12:05 AM

లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణకు మరోసారి పరీక్ష పెట్టే సూచనలు కనిపిస్తు న్నాయి. తెలుగు రాష్ట్రాలకు కొత్త సవాళ్లు పుట్టుకొచ్చే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కేంద్రంలో బీజేపీ ఊహించినట్టుగా సొంతంగా మెజారిటీ రాకపోవటంతో ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై బలంగానే పడేలా ఉన్నది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తప్పనిసరిగా మారింది. టీడీపీ 16 లోక్‌సభ స్థానాలు గెలిచింది. ఎన్డీయేకు మొత్తంగా 291 ఎంపీ స్థానాలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 272 సీట్లు కావాలి. ఈ లెక్కన చంద్రబాబు మద్దతు లేకపోయినా ఎన్డీయేకు 276 సీట్లు ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఉన్న 14 లోక్‌సభ స్థానాలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ, అది బొటాబొటి మెజారిటీనే అవుతుంది. అందువల్ల, మోదీ మూడోసారి సాఫీగా ప్రధాని పదవి నిర్వహించాలంటే చంద్రబాబు మీద ఆధారప డక తప్పదు. అప్పుడు ఏపీలో సర్వాధికారాలు అనుభవించటంతోపాటు కేంద్రం లో కూడా మోదీని ఆడించగల శక్తి చంద్రబాబుకు వస్తుంది. ఇక్కడే సమస్య మొద లయ్యేలా ఉన్నది.

విభజన సమస్యలు మరింత జటిలం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేండ్లవుతున్నది. ఇప్పటికీ ప్రధానమైన సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో రెండు రాష్ట్రాల మధ్య నీటివాటాల పంపిణీ జరుగలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఈ నెల 2వ తేదీతో గడువు తీరిపోయింది. కానీ, కొన్ని ఆస్తుల పంపకాలు అలాగే ఉన్నా యి. విద్యుత్తు బకాయిలపై ఇంకా తఖరారు నడుస్తూనే ఉన్నది. ‘ఏపీనే మాకు బాకీ’ అని తెలంగాణ వాదిస్తున్నది. ‘తెలంగాణనే మాకు అప్పు పడిందని’ ఏపీ కొట్లాడుతున్నది. గత పదేండ్లలో కేంద్రం లో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించటంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. నీళ్లు, నిధుల విషయంలో మోదీ సర్కారు తెలంగాణకు వ్యతిరేకంగానే పని చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పెట్టడం, సరైన సమయంలో ఇవ్వక పోవటం వాటిల్లో కొన్ని.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజులకే ఉమ్మడి నీటి పారుదల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన ఆధీనంలోకి తీసుకొన్నది. కొన్నేండ్లుగా ఈ ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ సర్కారు కోరుతూ వచ్చింది. అందుకు, బీఆర్‌ఎస్ సర్కారు అడ్డు తగులుతూ వచ్చింది. బీఆర్‌ఎస్ అడ్డు తొలగిపోగానే కేంద్రం ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నది. కొత్తగా వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకొనేలోపే అంతా అయిపోయింది. ఇప్పుడు ఏపీలోనూ ప్రభుత్వం మారింది. తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కేంద్రంలోనూ ఆయన చక్రం తిప్పబోతున్నారు. మోదీ తన మనుగడ కోసం చంద్రబాబు మాట విని తీరా ల్సిందే. ఈ సమయంలో చంద్రబాబు విభజన సమస్యలపై కేంద్రాన్ని తనకు అనుకూలంగా తిప్పుకొంటారనటంలో ఎలాంటి సందేహం లేదు.

ముప్పేట దాడి ప్రమాదకరం

సీఎం రేవంత్‌రెడ్డితో పోల్చితే కేసీఆర్‌కు రాజకీయ చతురత అపారమన్న విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. రేవంత్ అనుభవలేమితో ఇప్పటికే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ కోల్పోయింది. తాగునీటికి కూడా కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారబోతున్నది. చంద్రబాబు ద్వయం రాజకీయ దురంధరులే కాదు.. అనుభవజ్ఞలు, ఘటనాఘటన సమర్థులు కూడా. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకోగలరు. వారితో పోల్చితే రేవంత్ పిల్లాడి వంటివారే. చంద్రబాబు రెట్టింపు శక్తితో అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఏపీలో రాజధానితోపాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రతి అంశంపై చాలా సీరియస్‌గానే ఉంటారు. ఏ చిన్న ప్రయోజనాన్నీ, అవకాశాన్నీ వదులుకోరు. కేంద్రంలో, ఏపీలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన మరుక్షణం నుంచే తన లాబీయింగ్ మొదలు పెడుతారు. ఎలా గూ మోదీ ఏపీకే అనుకూలంగా వ్యహరిస్తారన్న పేరుంది కాబట్టి, ఆయనను బుట్టలో వేసుకోవటం చంద్రబాబుకు పెద్దగా కష్టం కాబోదు.

గత పదేండ్లుగా ఐటీ రంగంలోనూ, రియల్ ఎస్టేట్‌తోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం లోనూ హైదరాబాద్ నగరం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు గట్టి పోటీ ఇస్తున్నది. ఇప్పుడు ఏపీలో అమరావతిని చంద్రబాబు మళ్లీ రాజధానిగా చేస్తారు కాబట్టి, పెట్టుబడులు ఆకర్షించటం ఆయనకు తప్పనిసరి. నిజం చెప్పాలంటే హైద రాబాద్‌లో ఇప్పటికీ ఆంధ్రా పెట్టుబడిదారుల హవానే ఎక్కువ. అందునా చంద్ర బాబు సొంత సామాజిక వర్గం వారే బిజినెస్ టైకూన్లుగా ఉన్నారు. ఇప్పుడు చంద్ర బాబు తన వాళ్లందరినీ అమరావతికి ఆహ్వానిస్తారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చే పెట్టుబడులను కూడా హైదరాబాద్‌కు రాకుండా తన రాష్ట్రానికి తీసుకొనిపోయే అవకాశం ఉన్నది. విదేశాల నుంచి వచ్చే భారీ పెట్టుబడులను ఢిల్లీ స్థాయిలో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతారు.

రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ఎగరేసుకుపోతారు. అప్పుడు విభజన సమస్యలతోపాటు పెట్టుబడులపై కూడా అటు కేంద్రంతోనూ, ఇటు పక్కరాష్ట్రంతోనూ తెలంగాణ యుద్ధమే చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఇంకా కొన్ని అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం కేంద్రం తలుపు తట్టక తప్పదు. అక్కడ గుమ్మంలోనే చంద్రబాబు కూర్చొని ఉంటారు. కాబట్టి, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు క్లియర్ చేయించుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా కావచ్చు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలిపింది చంద్రబాబు, మోదీ జోడీయే. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నా ఏమీ చేయలేక పోయారు. ఇప్పుడు కూడా అలాంటి చీకటి నిర్ణయాలు తీసుకోరన్న గ్యారెంటీ ఏమీ లేదు. అదే జరిగితే తెలంగాణకు కోలుకోలేని నష్టం తప్పదు. 

కసితో ఉన్న చంద్రబాబు

గత ఐదేండ్లలో చంద్రబాబు ఏపీలో రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. కొంతకాలం జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అంతకు ముందు ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనను చావుదెబ్బ తీశారు. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకొని హైదరాబా ద్ నుంచి తరిమేశారు. ఆ తర్వాత ఐదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా, వాస్తవంగా అది కాగితాలపైనే కనిపించింది. చంద్రబాబు కేసునుంచి బయ ట పడేందుకు ఏపీ ప్రయోజనాలను నాడు పణంగా పెట్టారు. నాడు పోగొట్టుకొన్నవన్నీ తిరిగి సాధించుకొనేందుకు ఆయన ఈసారి కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇక్కడి ప్రభుత్వ పెద్ద తన శిష్యుడే కాబట్టి, రేవంత్ ఆనుపానులన్నీ చంద్రబాబుకు తెలుసు. ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదు. దీంతో హైదరాబాద్‌ను మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచేలా మోదీపై ఒత్తిడి తెచ్చినా తేవచ్చు. నాడు కేసీఆర్‌కు భయపడి నీళ్లు, నిధుల పంపకాలపై కూడా చంద్రబాబు కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపించారు. కానీ, ఈసారి అలా ఉండదు. రెట్టించిన ప్రతీకారంతో ఆయన విరుచుకు పడతారు. ఈ పరిస్థితులన్నీ కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ రాష్ట్రానికి అగ్నిపరీక్షనే పెడుతాయి.

వేణు బెక్కం, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు