రసాయనాల వాడకం వద్దు!
తెలంగాణలో రైతులు క్రిమి సంహారకాలను మితిమీరి వినియోగిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా పెస్టిసైడ్స్‌ను వినియో గిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలుస్తున్నది. ఇది వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో క్రిమిసంహారకాల వినియోగమూ భారీగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రైతులు ఎవరి సలహాలు పాటించక పంటపొలాలకు మందులు కొడుతూ వున్నారు. ఫలితంగా, అనవసర డబ్బులు ఖర్చుతోపాటు పంటనష్టమూ తప్పడం లేదు. మరోవైపు నేల సారం దెబ్బ తిని, ఉత్పత్తుల్లో అవశేషాల సమస్య తలెత్తుతున్నది. పంటచేలకు దగ్గరగా వుండే చెరువుల జలాలూ విషపూరితం అవుతున్నాయి. పురుగుమందుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి. ప్రత్యామ్నాయ పోషకాల వినియోగాన్ని సాగులో ప్రోత్సహించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసినా అది రైతులకు చేరడం లేదు. తెలంగాణసహా పలు రాష్ట్రాల రైతులకు అసలు అటువంటి పథకం ఉందని కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపట్టాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా






