calender_icon.png 7 September, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జూబ్లీహిల్స్’పై బీజేపీ గురి

31-08-2025 12:03:55 AM

  1. ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలి
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు
  4. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
  5. ప్రత్యేక జీవోలతో రిజర్వేషన్లు సాధ్యం కాదు
  6. ఎమ్మెల్యే పాయల్ శంకర్  
  7. రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు అధ్యక్షతన యూసుఫ్‌గూడలో సన్నాహక సమావేశం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ని యోజకవర్గ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. గెలుపే లక్ష్యం గా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు అధ్యక్షతన శనివారం యూసుఫ్ గూడలో భారీ సన్నాహక సమావేశం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగురవేయాలని నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావే శం వేదికగా బీజేపీ నేతలు రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేశాకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు లేదని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలన బీఆర్‌ఎస్ పాలనకు భిన్నంగా ఏమీ లేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్ తరహాలోనే రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తప్పకుండా బీజేపీకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హైకోర్టు డెడ్‌లైన్‌తో హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ నిర్ణయం న్యాయపరంగా నిలబడే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. “కేవలం ప్రత్యేక జీవోలతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదు. దీనివల్ల తలెత్తే న్యాయపరమైన అడ్డంకులకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముస్లింలను జతచేసి బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని అనుమానం వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేస్తూనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కీలక సమావేశంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు రాష్ర్ట, జిల్లా స్థాయి నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.